ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 15 నిమిషాలు ముందు కూడా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 15 నిమిషాలు ముందు కూడా..

May 27, 2022

సరికొత్త ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆర్టీసీలో అనేక మార్పులు వచ్చాయి. సంస్థను లాభాల బాటలో నడిపించడమే కాకుండా.. ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు సజ్జనార్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలే లక్ష్యంగా టీఎస్‌ఆర్టీసీ దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్స్‌ (ఇంటెలిజెంట్‌ టిక్కెట్‌ ఇష్యూ మిషన్‌) అతి త్వరలోనే ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 928 ఐ-టిమ్స్‌ యంత్రాలను కొనుగోలు చేసినట్టు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

వీటి ద్వారా బస్సు బయలుదేరడానికి 15 నిమిషాల ముందు కూడా టికెట్‌ రిజర్వ్‌ చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు వెబ్‌సైట్‌ లేదా ఆర్టీసీ రిజర్వేషన్‌ బుకింగ్‌/బస్ స్టేషన్లలోని కౌంటర్లలో రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధమయ్యేలోపు(బస్సు బయలుదేరడానికి గంట ముందు వరకు) మాత్రమే సీటు బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత రిజర్వేషన్లను నిలిపివేస్తారు. దీంతో.. సీట్లు ఖాళీగా ఉన్నా.. రిజర్వేషన్‌ లేని కారణంగా చాలా మంది ప్రయాణికులు తర్వాతి బస్సుకోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఐ-టిమ్స్‌ ద్వారా బస్సు బయలుదేరడానికి 15 నిమిషాల ముందు వరకు కూడా రిజర్వేషన్‌ సేవలు అందించే వీలుంటుందని సజ్జనార్‌ వివరించారు. ఈ యంత్రాలతో క్రెడిట్‌/డెబిట్‌కార్డులు, యూపీఐ వ్యవస్థ ద్వారా నగదురహిత చెల్లింపులు చేయవచ్చన్నారు.