తెలంగాణ రోడ్లపై త్వరలో ఎలక్రిక్ట్ బస్సులు పరుగులు తీయనున్నాయి. సౌండ్ లేకుండా రయ్ రయ్ మంటూ ఇక దూసుకుపోనున్నాయి. ఏడాది వ్యవధిలోనే తెలంగాణ ఆర్టీసీకి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు అందించే కాంట్రాక్ట్ జేబీఎం గ్రూప్, అశోక్ లేలాండ్ కంపెనీలకు దక్కింది. మొత్తం 1000 ఎలక్ట్రిక్ బస్సులలో 500 బస్సులను హైదరాబాద్లో.. మిగతా 500 బస్సులు నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర నగరాల్లో నడింపించాలని అధికారులు నిర్ణయించారు.రాష్ట్రంలో ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ బస్సులు నడవనున్నాయి.
హైదరాబాద్లో నడిపే బస్సులకు కిలోమీటరుకు రూ. 55, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 40 చొప్పున కాంట్రాక్ట్ సంస్థలకు ఆర్టీసీ చెల్లించాలి. ఆర్టీసీ తరఫున బస్సులో కండక్టర్ మాత్రమే ఉంటారు. టికెట్ల విక్రయం, ఛార్జీల వసూళ్లు మినహా ఇతర విషయాలేవీ ఆర్టీసీకి సంబంధం ఉండదు. డ్రైవర్ జీతం సహా రోజువారీ నిర్వహణ, మరమ్మతుల వంటి వ్యవహారాలన్నీ ఆ బస్సుకు చెందిన కాంట్రాక్టర్ చూసుకుంటారు. పొల్యూషన్ను తగ్గించడానికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్లో ఎలక్ట్రిక్ బస్సుల వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) కి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ప్రైవేటు సంస్థల ద్వారా ఈ బస్సులను టీఎస్ ఆర్టీసికి అందజేయనుంది. హైదరాబాద్ లో ప్రస్తుతం 40 ఎలక్ట్రిక్ బస్సులున్నాయి.