సమ్మె ఆగదు.. రేపు ఉద్యోగినుల నిరసన : అశ్వత్థామ - MicTv.in - Telugu News
mictv telugu

సమ్మె ఆగదు.. రేపు ఉద్యోగినుల నిరసన : అశ్వత్థామ

November 23, 2019

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆపేది లేదని  జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని తెలిపారు. షరతులు లేకుండా ఉద్యోగాల్లోకి తీసుకుంటే తాము చేరేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం కేసీఆర్ దీనిపై సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోవాలని కోరారు.  రేపు మరోసారి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. 

ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు.  రేపు ఎంజీబీఎస్ వద్ద మహిళా కార్మికులతో నిరసన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. నగరంలోని మహిళా కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మానవ హారాలుగా ఏర్పడి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. 

JAC.

మరోవైపు తెలంగాణ ఆర్టీసీని రక్షించాలని కోరుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ‘సేవ్ ఆర్టీసీ’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  తమ వినతిపై ప్రభుత్వం స్పందించకపోవడంపై మహిళా కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో బస్టాండుల నుంచి బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కొంత సేపు పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఖమ్మంలో ఓ మహిళా కార్మికురాలు తాత్కాలిక డ్రైవర్‌పై చెప్పుతో దాడి చేసింది. వెంటనే ఆమెను పోలీసులు అడ్డుకొని పక్కకు తీసుకెళ్లారు.