50 రోజులకు చేరిన ఆర్టీసీ సమ్మె.. డిపోల వద్ద మానవహారాలు - MicTv.in - Telugu News
mictv telugu

50 రోజులకు చేరిన ఆర్టీసీ సమ్మె.. డిపోల వద్ద మానవహారాలు

November 24, 2019

తెలంగాణ ఆర్టీసీ సమ్మె సరికొత్త చరిత్ర లిఖించింది. 50 రోజులుగా నిర్విరామంగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద సమ్మె కావడం విశేషం. కార్మికుల డిమాండ్లపై ఎటువంటి ముగింపు దొరక్క ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాము ఒక మెట్టు దిగివచ్చి షరతులు లేకుండా ఉద్యోగాల్లో చేరుతామన్నా ప్రభుత్వం స్పందించడం లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మరోసారి తమ భవిష్యత్ కార్యాచరణను నేడు ప్రకటించనున్నారు. 

TSRTC,Strike.

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పిలుపుతో  ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఉదయం నుంచి కార్మికులు డిపోల వద్ద మానవ హారాలుగా ఏర్పడి నిరసన తెలుపుతున్నారు. జేబీఎస్ వద్ద మహిళా కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము ఉద్యోగాల్లో చేరుతామన్నా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సమ్మె మొదలైన తర్వాత నుంచి దాదాపు 30 మంది కార్మికులు చనిపోయారు. ఇందులో నలుగురు ఆత్మహత్యలు చేసుకోగా, మిగిలిన వారు గుండెపోటుతో మరణించారు.