ఖమ్మంలో ఉద్రిక్తత.. కండక్టర్ శవంతో కలెక్టరేట్‌కు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఖమ్మంలో ఉద్రిక్తత.. కండక్టర్ శవంతో కలెక్టరేట్‌కు..

October 28, 2019

తెలంగాణ ఆర్టీసీలో కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. కార్మికుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మనస్థాపం చెందిన నీరజ(31) ఉరివేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.. ఆమె ఆత్మహత్య విషయం తెలిసిన కార్మికులు పెద్ద ఎత్తున ఆమె నివాసానికి చేరుకున్నారు. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఆమె మృతదేహంతో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు.  దీంతోపాటు సత్తుపల్లి డిపో ఎదుట తోటి కార్మికులు ఆందోళన చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడంతో  పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. కార్మికులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఎంత చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు. ఇప్పటికే ఇద్దరు ఆత్మహత్య చేసుకోగా తాజాగా నీరజ ఆత్మహత్య కార్మికుల్లో మరింత విషాదాన్ని నింపింది.  

Conductor.

ధర్నాలో పాల్గొనాలని వచ్చి :

సత్తుపల్లి డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న నీరజ.. తన పుట్టింట్లో జరిగే దీపావళి వేడుకల కోసం పల్లెగూడెం వెళ్లింది. అక్కడ వేడుకలు ముగియగానే ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లాలని చెప్పి సత్తుపల్లిలోని తన నివాసానికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కాగా నీరజ మరణంతో ఆర్టీసీ కార్మికుల మరణాల సంఖ్య 13కు చేరుకుంది. వీరిలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడగా, పది మంది గుండెపోటుతో మరణించారు. 

ిి