తెలంగాణ నుంచి ఏపీ వెళ్లే ప్రయాణికులకు టీఆఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి నాన్ ఏసీ స్లీపర్ బస్సులు సర్వీసులను నేడు (జనవరి 4) ప్రారంభం కానున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కేపీహెచ్బీ బస్టాప్ నుంచి ద్ద టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ వీటిని ప్రారంభిస్తారు. మొత్తం 10 స్లీపర్ బస్సులను టీఆర్ఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెస్తోంది. వీటిలో నాలుగు పూర్తిస్థాయి స్లీపర్ బస్సులు కాగా, ఆరు స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. స్లీపర్ బస్సులో లోయర్ బెర్తులు 15, అప్పర్ బెర్తులు 15 వరకు ఉంటాయి. ప్రైవేట్ బస్సులకు ధీటుగా వీటిని ఆర్టీసీ రూపొందించింది. ప్రతి బెర్త్ వద్ద మొబైల్ చార్జింగ్ పెట్టుకునే అవకాశం కల్పించారు. వైఫై సదుపాయం కూడా ఉంది. హైదరాబాద్-కాకినాడ, హైదరాబాద్ -విజయవాడ మార్గాల్లో ఈ బస్సులు పరుగులు పెట్టనున్నాయి.
హైదరాబాద్ నుంచి కాకినాడ వైపు వెళ్లే బస్సులు ప్రతిరోజూ రాత్రి 7.45, 8.30 గంటలకు బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయి. తిరిగి కాకినాడలో రాత్రి 7.15, 7.45 గంటలకు బయలుదేరుతాయి. అలాగే, విజయవాడ వైపు వెళ్లే బస్సులు మియాపూర్ నుంచి ప్రతిరోజూ ఉదయం 9.30, 10.45, 11.45 గంటలకు, రాత్రి 9.30, 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి ఉదయం 10.15, 11.15, మధ్యాహ్నం 12.15 గంటలకు, అర్ధరాత్రి 12.00, 12.45 గంటలకు తిరిగి బయలుదేరుతాయి.