tsrtc to launch smart card system like metro service
mictv telugu

మెట్రో రైళ్ల తరహాలో TSRTC స్మార్ట్ కార్డులు.. అతి త్వరలో

November 9, 2022

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కి, టికెట్ తీసుకునే క్రమంలో ప్రయాణికులు, కండక్టర్ల మధ్య చిల్లర విషయంలో ఏదో ఒకచోట చిన్న చిన్న వాగ్వాదాలు చూస్తూనే ఉంటాం. బస్ పాస్‌ల కోసం గంటల కొద్దీ క్యూ లైన్లలో నిల్చోవడం, అక్కడ నగదు తప్ప ఆన్‌లైన్ పేమెంట్ అనుమతించక వెనక్కి తిరిగొచ్చిన సందర్భాలెన్నో. కొన్ని కొన్ని సార్లు లెక్కల్లో తేడాలున్నాయని కండక్టర్లను కూడా పై అధికారులు మందలించిన రోజులూ ఉన్నాయి.

అయితే వీటన్నంటికి చెక్ పెట్టేలా, టిక్కెట్లు, పాసుల జారీని సులభతరం చేసేలా.. స్మార్ట్‌ శకానికి టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతమున్న టికెట్‌ జారీ యంత్రాల(టిమ్స్‌) స్థానంలో.. ఇంటెలిజెంట్‌ టికెట్‌ జారీ యంత్రాలు(ఐటిమ్స్‌)ను తీసుకురానుంది. మొబైల్‌ యాప్‌ ద్వారా బస్‌ పాసులను జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో వీటిని ఆర్టీసీ కౌంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే.. ఆన్‌లైన్‌లోనే రీఛార్జ్‌ చేసుకోవచ్చు.

మెట్రో రైళ్ల తరహాలో స్మార్ట్‌ కార్డులను కూడా ప్రవేశపెట్టనుంది ఆర్టీసీ. స్మార్ట్‌ కార్డులొస్తే ప్రతిసారీ టికెట్‌ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కార్డులో ఉన్న మొత్తం నుంచి ఛార్జీ సొమ్ము మినహాయించుకుని.. టికెట్లు ఇస్తారు. తొలి దశలో గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో 3,087 సర్వీసుల్లో 3,500 ఐటిమ్స్‌ యంత్రాలను వినియోగిస్తారు. ఇక్కడ విజయవంతమైన తీరును బట్టి దశలవారీగా రాష్ట్రమంతటా అమలు చేయనున్నారు.