ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు అధునాతన సౌకర్యాలతో కొత్త బస్సులను సిద్ధం చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం సరికొత్త సూపర్ లగ్జరీ బస్సులును అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1016 కొత్త బస్సులను కొనుగోలు చేయనుంది.
మొదటి విడతలో భాగంగా 630 సూపర్ లగ్జరీ, 130 డిలక్స్, 16 స్లీపర్ బస్సులను కొనుగోలు ఆర్డర్ ఇచ్చింది. 2023 నాటికి ప్రయాణికులకు అన్ని కొత్త బస్సులు ఆందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త సూపర్ లగ్జరీ బస్సులకు సాంకేతికతను జోడించారు. బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేస్తారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే పానిక్ బటన్ను నొక్కగానే టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంనకు సమాచారం అందుతుంది. ఈ సమాచారం ద్వారా వేగంగా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యాల సెక్యూరిటీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నారు.అగ్నిప్రమాదాల నుంచి అలర్ట్ చేసేందుకు ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం కూడా అందుబాటులో ఉండనుంది. ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. జర్నీలో వినోదం కోసం టీవీలను ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 సీట్లు ఉండనున్నాయి. నేడు (డిసెంబర్ 24) సూపర్ లగ్జరీ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభిస్తారు.