కానిస్టేబుల్ అరెస్ట్.. లిఫ్ట్ అడిగి మహిళల ఫోన్ నంబర్లు తీసుకుని.. - MicTv.in - Telugu News
mictv telugu

కానిస్టేబుల్ అరెస్ట్.. లిఫ్ట్ అడిగి మహిళల ఫోన్ నంబర్లు తీసుకుని..

July 12, 2020

car lift

తాను ఎందరినో రక్షించే రక్షకభటుడి హోదాలో ఉన్నానన్న విషయం మరిచిపోయి మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. పోలీసును కదా ధమ్కీలు ఇచ్చి తన పబ్బం గడుపుకోవచ్చు అని భావించినట్టున్నాడు. ఈ క్రమంలో మహిళల్ని వేధింపులకు గురి చేస్తోన్న కేసులో టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ వీరబాబును బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో వెళ్తున్న మహిళలను లిఫ్ట్‌ అడిగి.. వారి ఫోన్‌ నంబర్లు తీసుకుని వేధిస్తున్నాడని వీరబాబుపై ఫిర్యాదులు అందాయి. ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళలు వీరబాబుపై ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ చర్యలు చేపట్టారు. సదరు కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 12వ బెటాలియన్‌కు చెందిన టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌ వీరబాబు, కారులో వెళ్తున్న మహిళను  లిఫ్ట్‌ అడిగేవాడు. కారులో ఎక్కిన తర్వాత మహిళ ఫోన్‌ నెంబర్‌ తీసుకుని.. ఆ మరుసటి రోజు నుంచే వేధింపులు మొదలు పెట్టేవాడు. ఫోన్లు చేయడంతో పాటు, మెసేజీలతో వేధించాడని సిటీకి చెందిన ఇద్దరు మహిళలు సైఫాబాద్‌, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు వీరబాబు అదుపులోకి తీసుకున్నారు.  వీరబాబుపై ఐపీసీ 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. ‘చట్టానికి ఎవరూ అతీతులు కారు. యూనిఫాంలో ఉన్న ఇటువంటి నేరస్థులు సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నారు. ఎవరి నుంచైనా ఎటువంటి నానెన్స్‌ను భరించవద్దు. ఎలాంటి దుష్ప్రవర్తన పైనా అయినా వాట్సాప్‌ నంబర్‌ 9490616555కు ఫిర్యాదు చేయాల్సిందిగా కోరుతున్నా’ అని తెలిపారు.