Tsspdcl JLM Recruitment 2022 New Notification For 1000 Jlm Posts
mictv telugu

త్వరలో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ..

November 15, 2022

Tsspdcl JLM Recruitment 2022 New Notification For 1000 Jlm Posts

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSSPDCL).. 1,000 జూనియర్‌ లైన్‌మెన్‌ (JLM) పోస్టుల భర్తీకి త్వరలో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. సబ్‌ ఇంజనీర్‌ పోస్టులకు ఎంపిౖకైన అభ్యర్థులకు న‌వంబ‌ర్ 14వ తేదీన (సోమవారం) నియామక పత్రాలను అందజేయడంతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగిసింది.దీంతో జేఎల్‌ఎం నోటిఫికేషన్‌ జారీపై సంస్థ యాజమాన్యం కసరత్తు ప్రారంభించనుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ న‌వంబ‌ర్‌ నెలాఖరులోగా లేదా డిసెంబర్‌ తొలివారంలో నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

వాస్తవానికి 1000 జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి గత మే 9న సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్‌ జారీ చేసి.. జూలై 17న రాతపరీక్ష నిర్వహించింది. అయితే రాత పరీక్షలో అవకతవకలు చోటు చేసుకోవడంతో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. మొత్తం 181 మంది అభ్యర్థుల నుంచి విద్యుత్ శాఖలోని ఐదుగురు ఉద్యోగులు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి, వారికి సమాధానాలు చేరవేశారని తేలింది. దీంతో సదరు ఉద్యోగులపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వేటు వేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టారు. గత ఆగస్టు 25న సంస్థ యాజమాన్యం ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. తాజాగా కొత్త నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని విద్యుత్ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉందని తెలిపాయి.