TTD..Akhanda Harinama Sankirtana from 1st August
mictv telugu

టీటీడీ..ఆగస్ట్ 1 నుంచి అఖండ హరినామ సంకీర్తన

July 25, 2022

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాలపాటు తిరుమలలో నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తనను మళ్లీ పున:ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆగస్ట్ 1వ తేదీ నుంచి తిరుమలలో అఖండ హరినామ సంకీర్తనను మొదలుకానుందని అధికారులు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జానపద కళల పరిరక్షణతోపాటు అవి అంతరించిపోకుండా ఉండటానికి అధికారులు మళ్లీ ఈ అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం జరపడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

”కరోనా కారణంగా తిరుమలలో కొంతకాలం నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తనను ఆగస్టు 1 నుంచి ప్రారంభిస్తున్నాం. వివిధ ప్రాంతాలనుంచి జానపద కళాకారులు తిరుమలకు విచ్చేసి అన్నమయ్య, త్యాగయ్య తదితర వాగ్గేయకారుల భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. ప్రయాణ ఖర్చులు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. ఆగస్టు నెలకు సంబంధించిన భజన బృందాల సభ్యుల స్లాట్‌ వివరాలను ఇప్పటికే www.tirumala.orgలో అందుబాటులో ఉంచాం. కావున భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి” అని టీటీడీ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.