టీటీడీ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం డిసెంబర్ 22 (గురువారం) నుంచి ఆన్ లైన్లో టిక్కెట్లు జారీ చేస్తున్నామని వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి విడుదలయ్యే ఈ టిక్కెట్లను రోజుకు రెండు వేలను మాత్రమే విడుదల చేస్తామని తెలిపింది. దీని కోసం భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ. 10 వేలు విరాళం ఇవ్వడంతో పాటు రూ. 300 దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి పూర్తి చేసి ఆన్ లైన్లో టిక్కెట్ బుక్ చేసుకుంటే శ్రీవారిని మహా లఘు దర్శనం (జయ విజయుల వద్ద నుంచి) ఉంటుందని, భక్తులు గమనించాలని కోరింది. అలాగే జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల సర్వదర్శనం టిక్కెట్లు కేటాయిస్తున్నామని చెప్పింది. అలాగే వైకుంఠ ద్వార దర్శనానికి రోజుకు 25 వేల చొప్పున రెండున్నర లక్షల రూ. 300 సర్వదర్శనం టిక్కెట్లను ఆన్ లైన్లో కేటాయించనున్నారు. జనవరి 2న రాజ్యాంగ హోదాలో వీఐపీలు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శనం కల్పించబడుతుంది. ఇదికాక వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 7 కల్యాణ మండపాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ నిలిపివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. వీటిలో ఎస్ఎంసి-226ఎ, ఎస్ఎంసి-226బి, ఎస్ఎంసి-237ఎ, ఎస్ఎంసి-237బి, ఎస్ఎంసి-248ఎ, ఎస్ఎంసి-248బి, ఎటిసి-99 కల్యాణ మండపాలు ఉన్నాయి. అభివృద్ధి పనులు పూర్తి చేసిన అనంతరం తిరిగి భక్తులకు కేటాయిస్తామన్నారు. కాగా, జనవరి నెలలో తిరుమలలో జరిగే ముఖ్య పండుగల వివరాలు తేదీల వారీగా ఇలా ఉన్నాయి. జనవరి 2న స్వర్ణ ఏకాదశి, స్వర్ణ రథం ఊరేగింపు, వైకుంఠ ద్వార దర్శన ప్రారంభం, అఖండ విష్ణు సహస్రనామ పారాయణం జనవరి 3న స్వామి పుష్కరిణి తీర్థం, చక్రస్నానం 6న పౌర్ణమి గరుడ సేవ 7న ప్రణయ కలహోత్సవం 11న వైకుంఠ ద్వార దర్శనం ముగింపు 14న భోగి, 15న సంక్రాంతి, పారువేట ఉత్సవం 16న కనుమ, శ్రీగోదా పరిణయం 26న వసంత పంచమి 28న రథ సప్తమి వేడుకలు ఉండనున్నాయి.