నటుడు సూర్య తండ్రిపై టీటీడీ కేసు  - MicTv.in - Telugu News
mictv telugu

 నటుడు సూర్య తండ్రిపై టీటీడీ కేసు 

June 6, 2020

TTD case against hero Surya father for defamatory comments

తమిళ హీరో సూర్య తండ్రి, నటుడు శివకుమార్‌పై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ సభలో పాల్గొన్న శివకుమార్‌ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విమర్శించేలా మాట్లాడారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఏప్రిల్‌ 29న శివకుమార్‌పై కేసు నమోదైందని.. ఈ మెయిల్‌ ద్వారా విజిలెన్స్‌కు ఫిర్యాదు అందినట్లు టీటీడీ వెల్లడించింది.  తిరుమలలో అసాంఘిక కార్యక్రమాలు సాగుతున్నాయని, భక్తులు అక్కడి వెళ్లొద్దంటూ శివకుమార్ సోషల్ మీడియాలో సైతం ప్రచారం చేశారని పేర్కొంది. ఈ నేపథ్యంలో శివకుమార్‌పై కేసు నమోదు చేసినట్టు తిరుమల డీఎస్పీ ప్రభాకర్ బాబు తెలిపారు. అలాగే టీటీడీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినవారిపై కూడా టీటీడీ ఫిర్యాదు చేసింది. సదరు పోస్టులు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొంది. తిరుమల టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు వారిపై కేసులు నమోదు అయ్యాయి. ఎపిడమిక్‌ డిసీజెస్ యాక్ట్‌ ప్రకారం వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో చేసిన పోస్టుల వివరాలను టీటీడీ ఫిర్యాదులో పేర్కొంది.

ఇదిలావుండగా, టీటీడీ బోర్డు సభ్యురాలిగాఉన్న ఇన్ఫోసిన్ నారాయణమూర్తి భార్య సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై టీటీడీ స్పందిస్తూ.. ఇది ముమ్మాటికీ అసత్య  ప్రచారం అని‌‌ స్పష్టంచేసింది. ఫేస్‌బుక్‌లో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని టీటీడీ అధికారుల తెలిపారు. మరోవైపు వేంకటేశ్వరస్వామి ఆలయ చరిత్ర, టీటీడీలపై దుష్ప్రచారం చేసిన మరో 8 మందిపై కూడా కేసులు పెట్టామని అధికారులు వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని చెప్పారు.