కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేఫథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం సర్వదర్శనం ద్వారానే భక్తులకు అనుమతి ఇవ్వనుంది. వీఐపీ బ్రేక్ దర్శనం కేవలం ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం కానుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 వరకు కేవలం సర్వదర్శనం గుండానే శ్రీవారీ దర్శనానికి భక్తులను టీటీడీ అనుమతించనుంది.
తిరుమల బ్రహ్మోత్సవాలకు ప్రారంభానికి సూచికగా సెప్టెంబర్ 26న ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత రెండేళ్లుగా కరోనాతో బ్రహ్మత్సవాలను ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1న గరుడ సేవ, అక్టోబర్ 2న బంగారు రథం, అక్టోబర్ 4న మహారథం, అక్టోబర్ 5న చక్రస్నానం నిర్వహించనున్నారు. రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలకు భక్తులకు అనుమతివ్వలేదు. ఈసారి భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 27న సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.