తన పెళ్లి శుభలేఖలు పంచేందుకు కారులో వెళుతూ.. సడెన్‌గా గుండెపోటుకు గురైన టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే దురదృష్ట వశాత్తూ .. చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుకు గురైన ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రమౌళి చనిపోయారు. ఎక్మో సహా ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోయిందని ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.
చంద్రమౌళికి పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. కొన్నిరోజుల క్రితమే ఎంగేజ్మెంట్ జరిగింది. జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది. రెండు కుటుంబాలవారు శుభలేఖలు పంచుతున్నారు. చెన్నై ఆళ్వారుపేటలోని బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. కాసేపటికే గుండెనొప్పిగా ఉన్నట్లు పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని రోజుల్లోనే వివాహం జరగాల్సి ఉండగా చంద్రమౌళి మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.