తిరుమలలో అధికారుల నిర్వాకం వల్ల మహారాష్ట్రలో తలెత్తిన వివాదాన్ని సరిదిద్దేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది. తిరుమలలో ఛత్రపతి శివాజీ బొమ్మపై ఎలాంటి నిషేధం లేదని టీటీడీ వెల్లడించింది. వారం క్రితం టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అత్యుత్సాహం కారణంగా అలిపిరి దగ్గర మహారాష్ట్ర భక్తుల వాహనంపై శివాజీ బొమ్మను తొలగించారు. ఈ వివాదంపై స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఛత్రపతి శివాజీ బొమ్మలను తిరుమలకు అనుమతించడం లేదనేది దుష్ప్రచారమని కొట్టిపడేసింది. తిరుమల పవిత్రత దృష్ట్యా రాజకీయ, హిందూయేతర సంస్థలకు చెందిన వాటివి మాత్రమే తిరుమలకు అనుమతించబోమని స్పష్టం చేసింది.
అయితే, ఇటీవల మహారాష్ట్ర భక్తులకు చెందిన వాహనంపై ఛత్రపతి శివాజీ బొమ్మ తొలగింపుపై కాస్త వివాదం తలెత్తింది. దీంతో మహారాష్ట్రలో విమర్శలు, నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిం చాలనే ఉద్దేశంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి బోర్డు సభ్యుడు మిలిందా నర్వేకర్ శివాజీ విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ బొమ్మపై ఎలాంటి నిషేధం లేదని ప్రకటించారు. అదంతా కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే జరిగిందని చెబుతున్నారు. ఛత్రపతి శివాజీ, రామకృష్ణ పరమహంస, వివేకానంద ప్రతిమలను అనుమతిస్తామని స్పష్టం చేశారు.