తిరుపతి లడ్డూ ప్రసాదంపై టీటీడీ క్లారిటీ - MicTv.in - Telugu News
mictv telugu

తిరుపతి లడ్డూ ప్రసాదంపై టీటీడీ క్లారిటీ

November 11, 2022

ఏ ఆలయంలోని ప్రసాదానికీ లభించని రుచి తిరుమల లడ్డూ సొంతం. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంతే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత బంధువులకు, తెలిసిన వాళ్లకు పంచుతుంటారు. ఈ క్రమంలో లడ్డూ పై కొన్ని వదంతులు వచ్చాయి. ప్రసాదం బరువు తగ్గించారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై టీటీడీ స్పందించింది.

ప్రసాదం విషయంలో వచ్చిన అనుమానాలపై క్లారిటీ ఇస్తూ… సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మొద్దని కోరింది. “శ్రీవారి లడ్డూ ప్రసాదం నిబంధనల ప్రకారం 160 గ్రాముల నుంచి 180 గ్రాములు బరువు ఉంటుంది. ప్రతి రోజూ పోటు కార్మికులు త‌యారు చేసిన ల‌డ్డూ ప్రసాదాల‌ను ఒక ప్రత్యేక‌ ట్రేలో ఉంచి, ప్రతి ట్రే బ‌రువును పోటు అధికారులు త‌నిఖీ చేస్తారు. అనంత‌రం ల‌డ్డూ ప్రసాదాల‌ను కౌంట‌ర్లకు త‌ర‌లించి, భ‌క్తుల‌కు అందిస్తారు. ఇందులో పూర్తి పార‌ద‌ర్శత ఉంటుంది. వేయింగ్ మిషన్‌లో సాంకేతిక‌ సమస్య కారణంగా మైనస్ 70 అని ఉండటం, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం కార‌ణంగా లడ్డూ బరువుపై భ‌క్తులు అపోహల‌కు గుర‌య్యారు. కొన్ని వందల సంవత్సరాలుగా అత్యంత భ‌క్తి శ్రద్ధల‌తో లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారు. ల‌డ్డూ బ‌రువు, నాణ్యత విష‌యంలో కూడా టీటీడీ ఏనాడు రాజీ ప‌డ‌లేదు” అని పత్రికా ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. కానీ, ఇటీవల ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూ తూకం వేస్తే 90 నుంచి 110 గ్రాముల బరువు మాత్రమే ఉందట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో టీటీడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు.