TTD GIVING SARVADARSANAM TOKENS
mictv telugu

శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీకి ఏర్పాట్లు పూర్తి.. అర్ధరాత్రి నుంచే టైంస్లాట్ టోకెన్లు

October 31, 2022

TTD GIVING SARVADARSANAM TOKENS

శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త అందింది. సర్వదర్శన టోకెన్ల జారీ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసారు. ప్రత్యేక దర్శన టికెట్ల కొనుగోలుదారులకు మాదిరిగానే గతంలో సర్వ దర్శనం భక్తులకూ టోకెన్లను జారీ చేసేవారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా కాలం క్రితమే సర్వదర్శన టోకెన్ల జారీ నిలిచిపోయింది. తాజాగా సర్వదర్శన టోకెన్లనూ జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.

భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు. శని, ఆది, సోమవారాల్లో రోజుకు 25వేల టోకెన్లు, మిగతా రోజుల్లో రోజుకు 15వేల టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. టోకెన్‌ లభించిన భక్తులు అదేరోజు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. మూడు ప్రాంతాల్లో 30 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తామని, కోటా పూర్తవ్వగానే కౌంటర్లు మూసివేస్తామన్నారు. టోకెన్లు లేని వారు కూడా నేరుగా తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు.