TTD got huge amount of hundi income within 21 days in july
mictv telugu

టీటీడీ చరిత్రలోనే రికార్డు.. 21 రోజుల్లో రూ.100 కోట్లపైనే

July 24, 2022

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది. టీటీడీ చరిత్రలోనే శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. శ్రీవారి భక్తులు కాసుల వర్షం కురిపించారు. ఈనెలలో కేవలం 21 రోజుల్లోనే రూ. 100 కోట్ల ఆదాయం దాటింది. తాజాగా శ్రీవారి హుండీ ద్వారా రూ.100 కోట్ల 75 లక్షల ఆదాయం వచ్చింది. జూలై నెలాఖరు వరకు టీటీడీ చరిత్రలోనే అత్యధిక స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు గత మే నెలలో రూ.130 కోట్లే అత్యధిక హుండీ ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలో మొదటిసారి శ్రీవారికి రూ.140 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు.

ఇకపోతే.. ఈ నెల 5న భక్తులు శ్రీవారికి రూ.6.18 కోట్ల కానుకల్ని హుండీలో సమర్పించుకున్నారు. ఇలా ఒక్క రోజులో 6 కోట్ల పైచీలుకు ఆదాయం రావడం తిరుమల చరిత్రలో ఇది రెండోసారి. గతంలో 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకల్ని హుండీలో వేశారు భక్తులు. గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా తిరుమలకు రాలేని భక్తులు.. ఇప్పుడు పరిస్ధితులు కుదుటపడటంతో పోటెత్తుతున్నారు. ఈ కారణం చేతనే హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోందని అధికారులు అంటున్నారు. ఇకపోతే వేసవి సెలవుల కారణంగా గడిచిన నాలుగు నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతోన్న సంగతి తెలిసిందే. ఇదే జోరు కొనసాగితే మాత్రం ఈ ఏడాది శ్రీవారి ఆదాయం రూ.1,500 కోట్లు దాటుతుందని టీడీడీ అంచనా వేస్తోంది.

అలిపిరి నుంచి స్వామి కొండకు వేలాదిమంది భక్తులు కాలినడకన తిరుమల చేరుకుంటున్నారు. వాహనాల సంఖ్య కూడా పెరిగింది. శ్రీవారి ఆలయం, క్యూకాంప్లెక్స్‌లు, మాడవీధులు, అన్నప్రసాద భవనం, అఖిలాండం, బస్టాండు, రోడ్లు, దుకాణ సముదాయాలు, కల్యాణకట్ట, లడ్డూల జారీ కేంద్రం, ఇతర సందర్శనీయ ప్రదేశాలు భక్తులతో రద్దీగా మారాయి.