వెంకన్న డబ్బులను రాయలసీమకే ఖర్చు పెట్టాలి.. టీజీ
తిరుమల తిరుపతి దేవస్థానం రాయలసీమలో ఉందని.. టీటీడీకొచ్చే డబ్బులన్నీ రాయలసీమ అభివృద్ధికే ఖర్చు చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ దుర్గగుడి, సింహాచలం ఆలయాల డబ్బులు ఆ ప్రాంతానికే ఖర్చు చేసినప్పుడు టీటీడీ డబ్బులు రాయలసీమకు ఖర్చు చేయడంలో న్యాయం వుందని అన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలవారిని టీటీడీ మెంబర్స్‌గా నియమిస్తున్నారని.. కానీ వారు మాత్రం రాయలసీమ అభివృద్ధిపై మాత్రం మనసు పెట్టడం లేదని ఆరోపించారు. గోదావరి నీళ్లు కృష్ణా ప్రాంతానికే ఇచ్చి రాయలసీమ నీళ్లు ఇతర ప్రాంతాలకు తరలించడం అన్యాయం అని అన్నారు.
రాయలసీమ నీళ్లు సీమకే వాడుకునేలా చేస్తామని గతంలో వైఎస్ చెప్పారని గుర్తుచేశారు. కానీ ఇంత వరకూ ఆ జీవో అమలు కాలేదని మండిపడ్డారు. దీంతో భవిష్యత్తులో అలజడులు చెలరేగే అవకాశం ఉందని తెలిపారు. ‘అలుగు, గుండ్రేవుల, సిద్దేశ్వరం ప్రాజెక్టులు నిర్మిస్తే మా నీళ్లు మేమే వాడుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. సీఎం జగన్ కూడా ఎన్నికల మేనిఫెస్టోకే రాష్ట్ర బడ్జెట్‌ను ఖర్చు పెడుతున్నారు. దీని వల్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉండదు. వైసీపీ మేనిఫెస్టో వల్ల కొందరికే లాభం ఉంటుంది. కేంద్రం ఇచ్చే నిధులతో మాత్రం ప్రాజెక్టులకు స్పీడ్ బ్రేకర్లు లేకుండా పనులు పూర్తి చేయాలి’ అని కోరారు. అమరావతి ఫ్రీ జోన్, రాయలసీమకు నీళ్లు, నిధుల సాధన విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేశారు.