TTD Planning to use Palm baskets in laddu prasadam sale counters at Tirumala 
mictv telugu

Tirumala: లడ్డూ ప్రసాదం పంపిణీపై టీటీడీ కీలక నిర్ణయం

February 25, 2023

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు భక్తులు. లడ్డూ ప్రసాదానికి చాలా డిమాండ్ ఉంటుంది. 307 ఏళ్లు చరిత్ర ఉన్న ఈ తిరుమల ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులు భక్తితో స్వీకరిస్తారు. టీటీడీ కూడా లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తోంది. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడీపప్పు, కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు. రుచి, శుచిలో ఎక్కడా రాజీకారు. తిరుమల లడ్డూ ప్రసాదం రుచి మరెక్కడా దొరకదు. అంతటి ప్రాముఖ్యత ఉన్న తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ ఈ మధ్య కాలంలోనే పలు నిర్ణయాలు తీసుకోగా తాజగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

బుట్టల్లో లడ్డూ ప్రసాదాలు

 TTD Planning to use Palm baskets in laddu prasadam sale counters at Tirumala

తాటాకు బుట్టలను లడ్డూ విక్రయ కేంద్రాల్లో భక్తులకు అందుబాటులోకి తేవాలని టీటీడీ భావిస్తోంది. తిరుమలలో ప్రకృతి పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్‌ సహకారంతో బుట్టలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన పలు రకాల బుట్టలను ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ నిర్ణయం కారణంగా ప్రకృతి పరిరక్షణతో పాటూ పలువురికి ఉపాధి కల్పించినట్లవుతుందని తెలిపారు.

రూ.50కోట్లతో కొత్త వ్యవస్థ

తిరుమలలో లడ్డూ ప్రసాదాల పంపిణీకి సంబంధించి టీటీడీ ఇటీవల కొన్ని నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు లడ్డూ విక్రయ కేంద్రాలని పెంచాలని నిర్ణయించారు. అంతేకాకుండా ప్రసాదం తయారీ కోసం ఆత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. డిసెంబరు నాటికి రూ.50కోట్లతో కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది. స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా వస్తున్న ఈ అధునాత యంత్రాలు అందుబాటులోకి వస్తే బూందీ తయారీకి స్టవ్‌ల అవసరం ఇక ఉండదు. తిరుమలలో రోజుకు ఆరు లక్షల లడ్డూల తయారీ లక్ష్యంగా ఈ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు.