వెంకన్న ఆదాయం ఒక్కరోజే 2.34 కోట్లు.. మార్చి తర్వాత తొలిసారి  - MicTv.in - Telugu News
mictv telugu

వెంకన్న ఆదాయం ఒక్కరోజే 2.34 కోట్లు.. మార్చి తర్వాత తొలిసారి 

September 28, 2020

TTD records highest Hundi income of Rs 2.34 cr on Sunday

కరోనా వైరస్ కారణంగా భక్తుల రద్దీ తగ్గిన తిరుపతి దేవస్థానం మళ్లీ పునర్వైభవాన్ని సంతరించుకుంది. కరోనా తర్వాత వెంకన్న ఆదాయం ఒక్కరోజే రూ.2.34 కోట్లు వచ్చింది. ఆదివారం నాటి హుండీ ఆదాయం, లాక్‌డౌన్ తరువాత రూ.2 కోట్లను దాటిందని ఆలయ అధికారులు వెల్లడించారు. 12 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారని తెలిపారు. తిరుమల గిరులు క్రమంగా గత వైభవాన్ని సంతరించుకోవడంపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. మార్చి మూడవ వారంలో లాక్‌డౌన్ మొదలయ్యాక నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనాలు కల్పించామని చెప్పారు. 

తొలిదశలో 3 వేల మందికి లోపే దర్శనాలు చేయించామని.. ఈ నేపథ్యంలో హుండీ ఆదాయం క్రమంగా తగ్గుతూ రూ.50 లక్షల దిగువకు చేరిందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌కు ముందు రోజు వరకు రూ.3 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది.. క్రమంగా గత వైభవాన్ని చేరుతుండటం ఆనందంగా ఉందని వివరించారు. కాగా, కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తుల సంఖ్యను అధికారులు క్రమంగా పెంచుతున్నారు. తాజాగా అక్టోబర్ నెలకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయగా, టికెట్లన్నీ దాదాపు అయిపోయాయి. మరోవైపు కరోనాను నివారించాలని స్వామిని కోరుతూ.. తిరుమలలో 16 రోజుల పాటు సుందరకాండ దీక్ష జరుగనుంది. ఇందులో భాగంగా 2,821 శ్లోకాలను నిత్యం పఠనం చేయనున్నారు.