శ్రీవారి భక్తులకు నిరాశ.. దర్శనాలు ఇప్పట్లో లేనట్టే - MicTv.in - Telugu News
mictv telugu

 శ్రీవారి భక్తులకు నిరాశ.. దర్శనాలు ఇప్పట్లో లేనట్టే

May 18, 2020

TTD Suspends Temple Darshan

కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మరోసారి లాక్‌డౌన్ ఎఫెక్ట్ మరోసారి తప్పలేదు. మే 31వ తేదీ వరకు ఎలాంటి దర్శనాలు ఉండబోవని టీటీడీ స్పష్టం చేసింది. లాక్‌డౌన్ 4.0 నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. క్రతువులు, పూజలు మాత్రం స్వామివారికి నిత్యం నిర్వహిస్తూనే ఉంటామని చెప్పారు. ఆలయ దర్శనాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. దీంతో భక్తులకు శ్రీవారి దర్శనం కోసం మరి కొంత కాలం వేచి చూడక తప్పడం లేదు. 

దేశంలో నాలుగో విడత లాక్ డౌన్ ఆదేశాల్లో భాగంగా మతపరమైన ప్రదేశాల సందర్శనపై నిషేధం విధించింది. కాగా లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి టీటీడీ కొండపైకి భక్తులను అనుమతించడం లేదు. మార్చి 20 నుంచి రోజుకు సుమారుగా రూ.5 కోట్ల చొప్పున ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. దీంతో ఇప్పటి వరకు దాదాపు రూ.295 కోట్లకు పైగా  నష్టపోయామని అధికారులు చెబుతున్నారు. కాగా వేసవి సెలవుల్లో ప్రతి ఏటా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేది. కానీ ఈసారి మాత్రం కరోనా అన్ని రంగాలను కుదేలు చేస్తూనే ఉంది.