శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్ డేట్ ఇచ్చింది. భక్తుల సౌకర్యార్ధం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (మార్చి నెల)టికెట్లను రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్చి నుంచి మూడు నెలల పాటు వేసవి లో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో, దర్శనం తో పాటుగా శ్రీవారి సేవల్లో ఎక్కువ మంది భక్తులకు అవకాశం దక్కేలా టీటీడీ ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీ పైన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది.
అదే విధంగా మే నెల అంగప్రదర్శన టికెట్లను కూడా రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనుంది. ఇక సీనియర్ సిటిజెన్స్, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మార్చి నెల టికెట్లను ఈ రోజు (గురువారం) ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేసింది టీటీడీ. టీటీడీ అధికారిక వెబ్ సైట్(https://tirupatibalaji.ap.gov.in/#/login) తో పాటుగా టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా వీటిని భక్తులు పొందే అవకాశం ఉంది.
ఇదే సమయంలో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని జేఈవో కార్యాలయంలో శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీని తిరిగి ప్రారంభించింది. తిరుమలలోని గోకులం(జేఈవో) కార్యాలయంలో ఈ టికెట్లను ఇస్తారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆన్‌లైన్ శ్రీవాణి టికెట్లను ఇప్పటికి విడుదల చేయగా.. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 28 వరకు ఆఫ్‌లైన్‌లో రోజుకు 150 చొప్పున శ్రీవాణి టికెట్లను జారీ చేయనున్నారు. మార్చి నుంచి రోజుకు వెయ్యి చొప్పున శ్రీవాణి టికెట్లను ఇవ్వనున్నారు. ఇందులో 500 ఆన్‌లైన్‌లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో, 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంటాయి.