తిరుమల వేంకటేశుని భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నిన్న విడుదల చేసిన టీటీడీ.. నేడు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను ఆన్ లైన్ విడుదల చేయనుంది. శ్రీవాణి టికెట్లకు సంబంధించిన మార్చి, ఏప్రిల్, మే నెలల ఆన్ లైన్ కోటాను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. ఆన్ లైన్ లో రోజుకు 500 టికెట్లు చొప్పున భక్తులకు అందుబాటులో ఉంటాయి. అలాగే వసతి గదులు కూడా విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. మరోవైపు టీటీడీ జేఈవో కార్యాలయంలో రోజుకు 400 టికెట్లు ఆఫ్‌లైన్‌లో.. 100 టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఇటీవలె తిరుమలలోని గోకులం కార్యాలయంలో ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్ల జారీని టీటీడీ ఇటీవల పునఃప్రారంభించింది. ఫిబ్రవరి నెలలో ఇప్పటికే 750 టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అందువల్ల ఫిబ్రవరి 28 వరకు రోజుకు 150 శ్రీవాణి టికెట్లను తిరుమలలో జారీ చేయనున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా రద్దు చేసిన టీటీడీ.. వాటి స్థానంలో బయో డీ గ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక త్వరలోనే తాటాకు బుట్టలను లడ్డూ విక్రయ కేంద్రంలో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. తద్వారా తాటి చెట్టులను పెంచే వారికి ఆదాయంతోపాటు, తాటాకు బుట్టలను తయారు చేసే సంప్రదాయ వృత్తి కళాకారులకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.