TTD's key decision..reconsecration of 36-year-old temple
mictv telugu

టీటీడీ కీలక నిర్ణయం..36 ఏళ్ల ఆలయం పునఃప్రతిష్ఠాపన

September 10, 2022

తిరుమల తిరుపతి దేవస్ధానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 36 ఏళ్ల క్రితం మూతపడిన ఆలయాన్ని మళ్లీ పునఃప్రతిష్ఠాపన చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ ఆలయం విశిష్టతను తెలియజేస్తూ, తీసుకున్న నిర్ణయాలను ఓ ప్రకటన ద్వారా విడుదల చేసింది.”తిరుపతి నుంచి అలిపిరి వెళ్లే మార్గంలో కపిలతీర్థం ఉంటుంది. ఇది ప్రధానంగా శైవక్షేత్రం అయినప్పటికీ, ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఇది ఎంతో పురాతనమైనది. అయితే, ఈ ఆలయాన్ని 36 ఏళ్ల కిందట మూసివేశారు. ఇప్పుడీ ఆలయ పునఃప్రతిష్ఠాపన జరగనుంది. ప్రస్తుతం టీడీడీ ఆధ్వర్యంలో ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి” అని పేర్కొంది.

టీటీడీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ..”ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉన్నదని పండితులు నిర్ణయించారు. స్వామి వారు ఇక్కడి కోనేరులో స్నానం చేసి, ఆలయంలో పూజలు చేసి, సొరంగ మార్గంలో తిరుమలకు వెళ్లేవారని చరిత్ర చెబుతోంది. అందుకు ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంతటి విశిష్ట ఆలయాన్ని తిరుపతి వాసులు, దేశం నలమూలల నుంచి వచ్చే భక్తులు దర్శించుకునేవారు. ఆలయంలో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించి, పునరుద్ధరిస్తున్నాం” అని ఆయన అన్నారు. డిసెంబరు మాసంలో 2, 3, 4 తేదీల్లో పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరుగుతాయని వివరాలను వెల్లడించారు.