పోలీసులు చేసే పెళ్లి అంటే దేహశుద్ధే అనుకుంటాం. కానీ పోలీసులు నిజం పెళ్లిళ్లు కూడా చేస్తుంటారు. ప్రేమపక్షులకు రక్షణతోపాటు కోరితే మూడు ముళ్లు వేయిస్తుంటారు. కానీ ‘పోలీసు బుద్ధి’ ఎక్కడికెళ్లినా పోదు. అందరూ అలా కాకపోయినా కొందరు పోలీసులు ఉచ్ఛనీచాలు మరిచి కతుకుతుంటారు. కర్నూలు జిల్లా తుగ్గలి ఎస్ఐ సమీర్ బాషా ఓ ప్రేమ జంట దగ్గర లంచం అడిగి, అడ్డంగా బుక్కై ఉద్యోగం పోగొట్టుకున్నాడు.
మద్దికెరకు చెందిన క్రాంతి కుమార్, ప్రీతి ప్రేమించుకున్నారు. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో ఎస్ఐ సమీర్ బాషాను పెళ్లి చేయాలని కోరారు. అతడు 50 వేలు లంచం డిమాండ్ చేశాడు. ప్రేమ జంట తరపున తుగ్గలి వైకాపా ఎంపీటీసీ రాజు లంచగొండికి పదివేలను ఫోన్ పే చేసి, మిగతా సొమ్ము తర్వాత ఇస్తామని చెప్పాడు. ఎస్ఐ ఆత్రం తట్టుకోలేక రాజును వేధించాడు. మిగతా 40 వేలు ఇస్తేనే పెళ్లి చేస్తానంటూ బెదరింపులకు దిగాడు. దీంతో రాజు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ విచారణ జరిపి, లంచం నిజమేని తేల్చి, సమీర్ బాషాను సస్పెండ్ చేశాడు.