తప్పుడు వార్తలు రాస్తే పదేళ్ల జైలుశిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

తప్పుడు వార్తలు రాస్తే పదేళ్ల జైలుశిక్ష

March 27, 2018

వార్తలకు ఒకప్పుడు విశ్వసనీయత చాలా ఉండేది. ఇప్పుడు దారుణంగా తగ్గిపోయింది. సోషల్ మీడియా రాకతో పరిస్థితి మరింత విషమించింది. ఏ వార్త నిజమో, ఏ వార్త అబద్ధమో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో మలేసియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారికి పదేళ్ల జైలు శిక్షను విధించనుంది. అందుకోసం ఓ కొత్త చట్టాన్ని తీసుకురానుంది.  తప్పుడు వార్తలను రాసి ప్రచురించినవారికి, వారి వార్తలను ప్రచారం చేసిన వారికి పదేళ్ల జైలు శిక్షను లేదా 5 లక్షల రింగిట్లను(రూ. 84 లక్షలు) జరిమానాను విధించనుంది. కొన్ని సందర్భాల్లో రెండింటిని విధించాలని కూడా ముసాయిదా చట్టంలో ప్రతిపాదించారు.  

మలేసియాలో ఆగస్టులో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ గెలుపు కోసమే ప్రధాని నజీబ్ రజాక్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని హక్కుల కార్యకర్తలు, విపక్షాల నేతలు విమర్శిస్తున్నారు.

నజీబ్ రజాక్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పై ఎవరూ విమర్శలు చేయకుండా ఉండేందుకే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారని మండిపడుతున్నారు. ఆరోపణలను ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. ప్రజల భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని, ఇది భావప్రకటనా స్వేచ్ఛకు ఏ మాత్రం భంగం కలిగించదని చెబుతోంది.