Tummala Nageshwar Rao Sensational Comments Over Political Row in Telangana
mictv telugu

ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు.. మాజీ మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు

August 3, 2022

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని, కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. బుధవారం ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయెద్దని కార్యకర్తలకు సూచించారు. మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధిపైనే దృష్టి పెట్టానని గుర్తుచేశారు. కార్యకర్తలను పూర్తిస్థాయిలో కలవలేకపోయానని తెలిపారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానని, ఇప్పుడు మాత్రం పాలేరుపైనే దృష్టి పెట్టానని చెప్పారు. కార్యకర్తలు ఆశీర్వదిస్తే మిగిలిన పనులను పూర్తి చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

‘‘ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు’’ అని తుమ్మల చేసిన వ్యాఖ్యలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కారణం ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. తుమ్మల బీజేపీలో చేరుతారనే వార్త ప్రచారంలో ఉంది. రేపోమాపో బీజేపీలో చేరేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి , టీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరితో పాటు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లోని కీలక నేతలు కమలం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తుమ్మల కామెంట్స్‌పై పెద్ద చర్చ నడుస్తోంది. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ఓ చర్చ నడుస్తోంది. ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, కార్యకర్తలను సన్నద్ధం చేయడానికే ఆ వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు అంటున్నారు.