తుర్కియే, సిరియా భూకంప మృతుల సంఖ్య భారీగా పెరగుతుంది.శుక్రవారం నాటికి ఏకంగా 22 వేలు దాటింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఏ శిథిలం కదిలించినా దాని కింద మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. అయితే నాలుగురోజులు గడుస్తున్నా పలువురు ప్రాణాలతో బయటపడటం ఊరటినిస్తోంది. తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు లేకపోయినా వారు మృత్యువుతో పోరాడి ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు. తుర్కియేలో శిథిలాలను తొలగిస్తుండగా నిన్న ఒక్కరోజే 100 మందికి పైగా బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు.
మూత్రం తాగి..
ఒకవైపు ఆకలి బాధుల, మరోవైపు చలిగాలులతో బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు.అద్నాన్ మహమ్మద్ కోర్కుట్ అనే 17 ఏళ్ల యువకుడిని రెస్క్యూ బృందం రక్షించగా అతడు చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. దాహానికి మూత్రాన్ని తాగాల్సి వచ్చిందని మహమ్మద్ కోర్కుట్ చెప్తుంటే అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అదియామన్ అనే చోట నాలుగేళ్ల చిన్నారి 105 గంటల పాటు ప్రాణాలతో పోరాడి సురక్షితంగా బయటపడింది. ఆ చిన్నారి తల్లిదండ్రులను గురించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. తుర్కియాలోని మరోచోట అపార్ట్ మెంట్ శిథిలాల కింద చిక్కుకున్న 20 ఏళ్ళ విద్యార్థిని వాట్సాప్ ద్వారా తన స్నేహితులకు లోకేషన్ చెప్పి తన ప్రాణాలను రక్షించుకుంది.మరోవైపు అంత్యక్రియల కోసం తీసుకొస్తున్న మృతదేహాలతో శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయి.