పూర్వకాలంలో రాజులు చెప్పిందే వేదం. అందుకే, రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనే సామెత పుట్టుకొచ్చింది. రాజు మొండివాడు కూడా అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. తనకు ఎవరూ ఎదురు చెప్పలేరనే అహంకారంతో, ఎవరైనా ప్రశ్నస్తే శిక్షించే అధికారం తమకుందనే పొగరుతో రాజులు చాలా ఘోరాలకు పాల్పడ్డారు.
కాలం మారిపోయింది. రాజులు గతించారు. ప్రపంచమంతా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది. కొన్ని దేశాల్లో రాచరికం ఇంకా అమల్లో ఉన్నా అది రబ్బరు స్టాంపుతో సమానం. కానీ కొన్ని చోట్ల మాత్రం రాజరికం పచ్చిగా వర్ధిల్లుతోంది. కిరీటాలు, సింహాసనాలు కనిపించకపోయినా నరనరాన అహంకారం, గర్వం, పొగరు నిండిన నాయకులు రాజరికాన్ని దర్జాగా ప్రదర్శిస్తున్నారు.
తుర్క్మెనిస్తాన్ అధ్యక్షుడు గర్బాంగులీ బెర్దిముఖమెదోవ్ మరో ఆకు ఎక్కువే చదివాడు. తనకిష్టమైన జాతికుక్కకు ఆయన ఏకంగా భారీ బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. పశ్చిమాసియాకు చెందిన అలబాయ్ అనే జాతి కుక్క అంటే ఆయనకు ఎంతో ప్రేమంట. ఆ మహత్తరమైన ప్రేమకు గుర్తుగా ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు. తనకు అలబాయ్ కుక్కలంటే చాలా ఇష్టమని ప్రజలకు చెప్పడానికి బంగారు కుక్క బొమ్మను ప్రతిష్టించాడు. ఈ సందర్భంగా ప్రత్యేక నృత్యాలు చేయించి వేడుక నిర్వహించాడు. దేశ రాజధాని యాష్గబట్‌లోని ప్రముఖ చౌరస్తాలో సదరు కనకపు శునకం ఇప్పుడు హల్చల్ చేస్తోంది.
గర్బాంగులీ స్వయంగా ఆ కుక్క విగ్రహాన్ని ఆవిష్కరించాడు. బొమ్మ కింది భాగంలో ఎలక్ట్రానిక్ స్క్రీన్‌పై అలబాయ్ కుక్కల వీడియోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఇదెక్కడి విడ్డరూమని ప్రజలు ఆశ్చర్యపోతున్నా, అధ్యక్షుడికి భయపడినట్టే ఆ కుక్కకు కూడా భయపడి పక్కకు తప్పుకుని పోతున్నారు. అధ్యక్షుడికి అలబాయ్ కుక్కలపై అంత ప్రేమకు కారణాలు చాలానే ఉన్నాయి. ఆ జాతికుక్కలు పశువులకు చక్కగా కాపలా కాస్తాయి. పులులను, తోడళ్లను ఆమడదూరం తరిమేస్తాయి. తుర్క్మెనిస్తాన్ ప్రజల జీవితంలో ఆ కుక్కలు ఒక భాగం. అధ్యక్షుడ గుర్బంగులీ మూడేళ్ల కిందట అలబాయ్ కుక్కలపై పెద్ద కవిత రాసి రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అంకితం చేశాడు. దాంతోపాటు ఒక అలబాయ్ కుక్కపిల్లను కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడు.