కరోనా పార్టీ.. ముందుగా ఎవరికి సోకితే వారికి గిఫ్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా పార్టీ.. ముందుగా ఎవరికి సోకితే వారికి గిఫ్ట్

July 4, 2020

Covid-19

కరోనా సమయంలో ప్రపంచం మొత్తం తీవ్ర భయాందోళనల నడుమ బిక్కుబిక్కుమంటున్నారు. అలాంటిది కొందరు కుర్రాళ్లకు కరోనా పిచ్చి ముదిరి పీక్‌కు చేరింది. చిన్న అవకాశం దొరికినా కరోనా మనుషులను పీక్కు తినడానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని కూడా వారు కామెడీగా తీసుకున్నారు. దాంతోనే పరాచికాలు పెట్టుకున్నారు. కరోనా పార్టీలో ఎవరికి మొదటగా సోకుతుందో వారికి బహుమతిగా పిజ్జా లభిస్తుందని, వెర్రి వెయ్యి పుంతలు తొక్కినట్టు పార్టీ పెట్టుకున్నారు. దానికి ‘కోవిడ్-19 పార్టీ’ అని పేరు కూడా పెట్టుకున్నారు. అమెరికా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అలబామా రాష్ట్రంలో కొంతమంది విద్యార్థులు కొరివితో తల గోక్కున్నంత పనే చేశారు. కొవిడ్ -19 పార్టీ అని పేరు పెట్టి.. కరోనా పాజిటివ్‌ వ్యక్తులతో కలిసి పార్టీ చేసుకొన్నారు. పాజిటివ్‌ ఉన్న వ్యక్తుల ద్వారా కరోనా వ్యాపిస్తుందా? అని తెలుసుకోవడమే ఈ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు ఓ ఛాలెంజ్ కూడా విసిరారు. ఈ పార్టీ ద్వారా కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి పిజ్జా తొలి బహుమతిగా అందజేస్తామని వీర లెవల్లో అనౌన్స్ చేసుకున్నారు.

ఇంకే ఇలాంటి వెర్రి వెంగళప్పలే కదా కరోనాకు కావాల్సింది. మీరు వెర్రివేషాలు వేయండి నేను రెచ్చిపోతాను అన్నట్టు కరోనా గుంటకాడి నక్కలా వేచి ఉంది. పార్టీలో పాల్గొన్నవారు ఇన్ఫెక్షన్ రావడానికి చేయగలిగినదంతా శక్తి పూర్వకంగా చేశారు. పార్టీలో పాల్గొనేందుకు ఆసక్తి చూపినవారి నుంచి కొంత డబ్బు వసూలు చేసి.. ఆ మొత్తాన్ని వ్యాధి సోకిన మొదటి వ్యక్తికి ఇవ్వాలని కూడా నిర్ణయించారు. విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా కరోనా బారిన పడటానికి ఇలాంటి పార్టీలే కారణమని అలబామా నగర సలహాదారు సోనయా మెకిన్స్ట్రీ చెప్పారు. ఈ సంఘటన గురించి తమ వద్ద సమాచారం ఉందని, అయితే ఇది కేవలం పుకారు మాత్రమేనని భావించామని అధికారులు చెబుతున్నారు. తరువాత దర్యాప్తు చేస్తే అది నిజంగానే జరిగిందని తెలిసిందని తెలిపారు. అంతకుముందు, విద్యార్థులు వల్లా-వల్లా అనే ప్రదేశంలో అలాంటి పార్టీ చేసి కరోనా బారిన పడటానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కాగా, కరోనా వైరస్‌ బారిన పడటం తమకు ఆరోగ్యపరంగా మంచిదని చాలా మంది అమెరికన్లు భావిస్తున్నట్టుగా ఒక నివేదిక స్పష్టంచేసింది. ఈ వైరస్‌కు గురవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుందని వారు భావిస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.