బాలీవుడ్‌కు వరుస షాక్‌లు.. ఓ నటుడికి కరోనా, మరో నటుడు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్‌కు వరుస షాక్‌లు.. ఓ నటుడికి కరోనా, మరో నటుడు మృతి

July 12, 2020

TV actor

బాలీవుడ్‌లో మరో టీవీ సీరియల్ నటుడికి కరోనా సోకింది. స్టార్‌ప్లస్‌లో ప్రసారం అవుతున్న సూపర్‌హిట్‌ సీరియల్‌ ‘కసౌటీ జిందగీ కీ’ నటుడు పార్థ్‌ సంథాన్‌కు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. సంథాన్‌ వారం నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఉన్నపళంగా షూటింగ్‌ నిలిపివేశారు. తనతోపాటు షూటింగ్‌లో ఉన్నవారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సంథాన్‌ సోషల్‌ మీడియా ద్వారా కోరాడు. ‘అందరికీ హాయ్‌. నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. నాకు స్వల్ప లక్షణాలు ఉన్నాయి. నాతో పాటు షూటింగ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దయచేసి పరీక్షలు చేయించుకోండి. ప్రస్తుతం నేను స్వీయనిర్భందంలో ఉన్నాను. బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) సిబ్బంది నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు. అవసరమైన సహాయం చేస్తున్న వారికి కృతజ్ఞతలు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని సంథాన్‌ వెల్లడించాడు. 

 

బాలీవుడ్‌లో మరో విషాధం..

బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ, టీవీ నటుడు రంజన్‌ సెహగల్‌(36) జులై 11న మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన పరిస్థితి విషమించడంతో చండీగఢ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

రంజన్ సెహగల్ మృతితో టీవీ రంగం దిగ్భ్రాంతికి లోనైంది. అతడి సహ నటులు విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు. రంజన్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు రంజన్ మృతిపై సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(సీఐఎన్‌టీఏఏ) సోషల్‌ మీడియా వేదికగా నివాళి ఆర్పించింది. కాగా, ఐశ్వర్యరాయ్‌, రణదీప్ హుడా జంటగా నటించిన ‘సరబ్‌జీత్‌’ చిత్రంలో రాజన్‌ నటించాడు. అలాగే ఫోర్స్‌, కర్మ, మహీ ఎన్‌ఆర్‌ఐ (పంజాబీ) తదితర సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. బుల్లితెరపై క్రైమ్‌ పెట్రోల్‌, సావధాన్‌ ఇండియా, తుమ్‌ దేనా సాత్ మేరా లాంటి కార్యక్రమాలతో పాపులర్ అయ్యాడు. 2010 నుంచి రంజన్ సీఐఎన్‌టీఏఏ సభ్యుడిగా ఉన్నాడు.