టీవీ నటికి ఆర్థిక కష్టాలు.. నగలు అమ్ముకుని, అప్పులు చేస్తూ..  - MicTv.in - Telugu News
mictv telugu

టీవీ నటికి ఆర్థిక కష్టాలు.. నగలు అమ్ముకుని, అప్పులు చేస్తూ.. 

October 9, 2019

Nupur Alankar.

సినిమాల్లో, టీవీ సీరియళ్లలో ఒక వెలుగు వెలిగిన నటీనటులు ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్న సంఘటనలు చూస్తున్నాం. తాజాగా మరో హిందీ టీవీ సీరియల్ సీనియర్ నటికి ఆర్థిక కష్టాలు వచ్చాయి. డబ్బుల్లేక ఇంట్లో వున్న వెండి, బంగారు సొమ్ములు అమ్ముకుని, తెలిసినవాళ్ల దగ్గర అప్పులు చేస్తూ చాలా కఠినంగా కాలం వెళ్లదీస్తోంది ఆమె.  ప్రముఖ హిందీ టీవీ నటి నూపుర్ అలంకార్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. కానీ, ఇప్పుడు దయనీయ స్థితిలో కాలం వెళ్లదీస్తోంది. ప్రస్తుతం రోజు గడవడానికి కూడా ఆమె దగ్గర డబ్బులు లేవని తెలుస్తోంది. 

గత సెప్టెంబరు 24న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో- ఆపరేటివ్ బ్యాంకుకు.. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఒక నోటీసు పంపించింది. దీనిలో పీఎంసీ బ్యాంకు ఆరు నెలల వరకూ నూతనంగా ఎటువంటి లావాదేవీలు చేయకూడదని సూచించింది. దీంతో ఆ బ్యాంకులో వున్న ఖాతాదారులు రూ. 25 వేలకు మించిన మొత్తాన్ని తీసుకోలేకపోతున్నారు. అయితే నూపుర్‌కు ఈ బ్యాంకులోనే ఖాతా ఉంది. దీంతో ఆమెకు సదరు బ్యాంకు నుంచి డబ్బులు రాకుండాపోయాయి. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్నానని నుపుర్ వాపోయింది. ఈ సందర్భంగా నూపుర్ మాట్లాడుతూ.. ‘నేను చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాను. నాకు మరో బ్యాంకులో ఖాతా లేదు. నా సంపాదన మీదనే ఆధారపడి తల్లి, సోదరి, భర్త, అత్తామామలు జీవిస్తున్నారు. ఇప్పుడు డబ్బులు లేకుండా ఎలా బతకాలో తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉంటున్న ఇంటిని అమ్ముకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు మేము రోజువారీ ఖర్చుల కోసం ఇంట్లోని బంగారు, వెండి నగలను అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడింది. అదీకాకుండా తెలిసినవారి నుంచి ఇప్పటివరకూ రూ. 50 వేలు అప్పు కూడా చేశాను’ అని నుపుర్ వాపోయింది. బ్యాంకులోని తమ డబ్బులు పోతాయేమోనన్న భయం పట్టుకున్నదని ఆమె ఆందోళన వ్యక్తంచేసింది.