శ్రావణి కేసు.. Rx100 నిర్మాత పరార్..! - MicTv.in - Telugu News
mictv telugu

శ్రావణి కేసు.. Rx100 నిర్మాత పరార్..!

September 14, 2020

బుల్లితెర నటి శ్రావణి హత్య కేసులో నిందితులు సాయికృష్ణా రెడ్డి, దేవరాజ్‌ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. శ్రావణి హత్యకేసులో నువ్వంటే నువ్వు అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వారికి సంబంధించిన ఆడియో టేపులను స్వాధీనం చేసుకున్న పోలీసులు పలు కీలక ఆధారాలను రాబట్టారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆర్ఎక్స్ 100 చిత్ర నిర్మాత అశోక్ రెడ్డి పరారీలో ఉన్నాడు. కేసుకు సంబంధించి సోమవారం విచారణకు రావాలని పోలీసులు అతడికి ఇప్పటికే నోటీసులు పంపారు. అయినా అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఇవాళ ఉదయం నుంచి అతడి ఫోన్ స్విచ్చాఫ్‌ వస్తోంది. దీంతో పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టనున్నారు.  

ముగ్గురూ నిందితులే..

దేవరాజ్ పెళ్లికి నిరాకరించడం, సాయి, అశోక్ రెడ్డి వేధింపులతోనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక  సాయి, దేవరాజ్‌లకు కరోనా పరీక్షల అనంతరం ఇవాళ మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో సాయికృష్ణారెడ్డి(ఏ1), అశోక్ రెడ్డి(ఏ2), దేవరాజ్ రెడ్డి(ఏ3) నిందితులుగా చేర్చినట్టు వెస్ట్ జోన్ డీసీసీ ఏఆర్ శ్రీనివాస్‌ తెలిపారు. సాయి, శ్రావణిని వేధించినట్లు ఆధారాలు ఉన్నాయని అన్నారు. చనిపోయేముందు శ్రావణికి, దేవరాజ్‌కు మధ్య సంభాషణ జరిగిందని.. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం వల్ల దేవరాజ్‌ ఈ కేసులో భాగం అయ్యాడని అన్నారు. గతంలో కూడా దేవరాజ్‌పై శ్రావణి కేసు పెట్టారని వివరించారు. పెళ్లి చేసుకుంటామని నమ్మించి తర్వాత ఆమెకు ఇతరులతో సంబంధాలు ఉన్నాయని వేధించడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ముగ్గురి వేధింపులు తట్టుకోలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. కాగా, అశోక్ రెడ్డి నిర్మించిన ‘ప్రేమతో మీ కార్తిక్’ అనే సినిమాలో శ్రావణికి ఒక చిన్న పాత్ర ఇచ్చాడని.. 2017 నుంచి అశోక్ రెడ్డి శ్రావణితో సన్నిహితంగా ఉంటున్నాడని తెలిపారు. పరారీలో ఉన్న అశోక్ రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు.