TV channels to broadcast 30 minutes of ‘national interest’ content daily: Centre
mictv telugu

టీవీ ఛానెళ్లకు కేంద్రం కొత్త రూల్..

November 11, 2022

టీవీ ఛానెళ్లకు కేంద్రం కొత్త రూల్ తీసుకువచ్చింది. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు టీవీ ఛానెళ్లు తప్పకుండా జాతీయాసక్తి, ప్రజా సేవకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేయాల్సిందిగా స్పష్టం చేసింది. అయితే క్రీడలు, వన్యప్రాణులు, విదేశీ ఛానెళ్లకు ఈ రూల్స్ వర్తించవని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. త్వరలోనే దీనికి సంబంధించిన సర్క్యులర్ జారీ చేస్తామని సదరు శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. కొత్త ఆదేశం ప్రకారం.. జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలైన విద్య, అక్షరాస్యత, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం, సాంస్కృతిక వారసత్వం, జాతీయ సమైక్యత, రక్షణ మొదలైన అంశాల మీద కంటెంట్ ప్రసారం చేయాల్సి ఉంటుంది.

అయితే, ఆ సమాచారాన్ని ప్రభుత్వం అందించబోదని, టీవీ చానళ్లే సేకరించుకోవాలని వివరించింది కేంద్రం. అదేవిధంగా, న్యూస్‌ సంబంధం లేని ఈవెంట్ల లైవ్‌ టెలికాస్ట్‌కు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది. మార్గదర్శకాలను తొలుత 2005లో జారీ చేశారు. అనంతరం 2011లో సవరించారు. దాదాపు 11 ఏండ్ల తర్వాత ఇప్పుడు.. పలు నిబంధనలను సడలిస్తూ కొత్త మార్గదర్శకాలను ఆమోదించింది. కాగా, ఛానళ్లలో తాము చెప్పిన అంశాలే ప్రసారం చేయాలని కేంద్రం ఆదేశించటంపై మీడియా వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇది మీడియా స్వేచ్ఛను హరించటమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.