సీరియల్ చూసి.. మంటల డ్యాన్స్ చేసి.. - MicTv.in - Telugu News
mictv telugu

సీరియల్ చూసి.. మంటల డ్యాన్స్ చేసి..

November 29, 2017

సినిమాలే కాదు టీవీ సీరియళ్లు కూడా ఈ నడుమ మరీ దారుణంగా తయారయ్యాయి. సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా నేరాలు, ఘోరాలను చూపుతున్నాయి. కొందరు వాటి ప్రభావంతో వింతగా ప్రవర్తిస్తుంటారు కూడా. పెద్దలే కాదు.. పిల్లలు కూడా వీటి దుష్ప్రభావానికి గురవుతున్నారు.

కర్ణాటకలో ఏడేళ్ల బాలిక  సీరియల్‌ చూస్తూ అందులో చూపిన విన్యాసం చేయడానికి ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపై  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.  ఈ విషాదం నెల 11న జరిగింది. దేవన్‌గిరి జిల్లాలోని హరిహర పట్టణానికి చెందిన ప్రార్థన అనే బాలిక రెండో తరగతి చదువుతోంది. తల్లితో కలిసి ప్రతిరోజూ టీవీ సీరియళ్లు చూడడం వ్యసనంగా మారింది. ఇటీవల ఓ టీవీ చానల్ వదిలిన కన్నడ టీవీ సీరియల్లో  ఓ పాత్ర మంటల్లో డ్యాన్స్‌ చేసిందట. బాలిక ఆ డ్యాన్స్ చూసి తానూ చేయాలని అనుకుంది.

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని తన చుట్టూ కాగితాలు పెట్టుకుని అగ్గిపుల్ల అంటించింది.  కాలిపోతున్నా పట్టించుకోకుండా డ్యాన్స్ చేసి గాయాలపాలైంది. ఆస్పత్రికి తరలించగా అక్కడే చనిపోయింది. సీరియళ్లు చూడొద్దని చెప్పేదాన్ని అని, అయితే తాము బయటికి వెళ్లినప్పుడు చూసేదని ఆమె తల్లి చెప్పింది. తాము చేసిన తప్పు మరొకరు చేసి పిల్లలను పోగొట్టుకోవద్దని చెప్పింది.