టీవీ9 రవిప్రకాశ్ 4 కోట్ల విరాళం.. ఆస్పత్రికి చేయూత - MicTv.in - Telugu News
mictv telugu

టీవీ9 రవిప్రకాశ్ 4 కోట్ల విరాళం.. ఆస్పత్రికి చేయూత

April 18, 2018

టీవీ9 అధినేత రవిప్రకాశ్ పెద్దమనసు చాటుకున్నారు. కృష్ణా జిల్లా కూచిపూడిలో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న సంజీవని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం రూ. 4 కోట్ల భూరి విరాళం అందించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ సాయం చేస్తున్నారు. కూచిపూడి, చుట్టుపక్కల 70 గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించడానికి 200 పడకల సామర్థ్యంతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల ప్రజలు మెరుగైన వైద్యం కోసం 50 కి.మీ.దూరంలోని విజయవాడకు వెళ్తున్నారు.

సంజీవని ఆస్పత్రిలో జనరల్ మెడిసినే కాకుండా గైనకాలజీ, కార్డియాలజీ, చిన్న పిల్లలకు ప్రత్యేక విభాగాలు, రెండు ఐసీయూలు, 5 ఆపరేషన్ థియేటర్లు, సమగ్ర డయాగ్నొస్టిక్ లేబరేటరీ ఉంటాయి. రవిప్రకాశ్ చిన్నప్పటి నుంచే సమాజ సేవ చేయాలని పరితపించేవారు. ఆయన వివిధ విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కొత్త ఒరవడితో టీవీ9ను స్థాపించి మీడియాలో సంచలనాలు సృష్టించారు. ప్రొఫెషనలిజాన్ని పరిచయం చేశారు. తెలుగుతోపాటు కన్నడ, గుజరాతీ తదితర భాషల్లోనూ చానళ్లను ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా గత ఏడాది తన పేరుతో ఫౌండేషన్ ప్రారంభించారు. ఇది మనదేశంతోపాటు వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లోనూ విద్య, వైద్య సేవలను అందిస్తోంది.