వేతన జీవులపై లాక్‌డౌన్ గుది బండలా మారింది. చాలా కంపెనీల వ్యాపారాలు నిలిచిపోవడంతో ఈ ప్రభావం ఉద్యోగులపై పడింది. దీంతో పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించడమో, జీతాల్లో కోత విధించడమో చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ ప్రకటన చేయగా.. తాజాగా టీవీఎస్ మోటార్స్ సంస్థ కూడా చేరింది. ఆరు నెలల పాటు వేతనాల్లో కోత విధించాలని నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ నష్టాల నుంచి బయటపడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆ సంస్థ పేర్కొంది.
ఈ కోతలను చిన్న ఉద్యోగులపై పడకుండా మాత్రం జాగ్రత్త పడింది. ఉన్నతస్థాయి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు 15 నుంచి 20 శాతం కోత పెడతామని ప్రకటించింది. వీటిని మే నుంచి అక్టోబర్ వరకు అమలు చేస్తామని చెప్పింది. చిరు ఉద్యోగులు, కార్మికులపై మాత్రం పభావం లేకుండా చేసింది. కాగా లాక్‌డౌన్ విధించడంతో వాహన అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉత్పత్తులు కూడా తగ్గిపోయాయి. లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత మే 6న తిరిగి తన కార్యకలాపాలను టీవీఎస్ ప్రారంభించింది.