కాబూల్ గురుద్వారాలో జంట పేలుళ్లు.. ఆందోళనలో భారత్ - MicTv.in - Telugu News
mictv telugu

కాబూల్ గురుద్వారాలో జంట పేలుళ్లు.. ఆందోళనలో భారత్

June 18, 2022

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉగ్రదాడులు పెరిగిపోతున్నాయి. రాజధాని కాబూల్‌లో ఉన్న గురుద్వారాలో జంట పేలుళ్ళు సంభవించాయి. నగరంలోని కార్తేపర్వాన్ గురుద్వారాలో శనివారం ఉదయం 6 గంటలకు భక్తులు ప్రార్ధన చేస్తుండగా ఈ పేలుళ్లు జరిగిందని ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అరగంట తర్వాత మరో పేలుడు జరిగిందని, ప్రాణ నష్టం ఎంత అనే వివరాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించింది. అనంతరం భద్రతా బలగాలు పేలుడు జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కాగా, ఇది ఐఎస్ ఉగ్రవాదుల పనేనని అనుమానిస్తున్నారు. ఈ పేలుళ్లపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని దగ్గర నుంచి గమనిస్తూ, తాజా సమాచారం కోసం వేచి చూస్తున్నామని పేర్కొంది. కొంత మంది దీనిని ఆత్మాహుతి దాడులుగా భావిస్తున్నారు.