పార్వతీ మీనన్ విమర్శపై విజయ్ దేవరకొండ ఫైర్  - MicTv.in - Telugu News
mictv telugu

 పార్వతీ మీనన్ విమర్శపై విజయ్ దేవరకొండ ఫైర్ 

November 28, 2019

Twitter applauds Parvathy Thiruvothu for views on Vijay Devarakonda’s ‘Arjun Reddy’

విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రి టాప్ స్టార్‌గా నిలబెట్టిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెల్సిందే. ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లో కూడా రీమేక్ చేయగా..అక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమా విడుదలైనప్పుడు ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ మలయాళ నటి పార్వతి  మీనన్ ఘాటుగా స్పందించారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హాలీవుడ్‌లో విడుదలైన ‘జోకర్’ సినిమాతో పోల్చారు. ‘జోకర్’ సినిమాలో హీరో చేసే హత్యలు సహజంగా ఉన్నాయని, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరో హీరోయిన్‌ను కొట్టడం హింసను ప్రేరేపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్వతి వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..‘నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇక నా వల్ల కాదు. నేను దీని గురించే ఆలోచిస్తుంటే అది నా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నేను సాధారణంగా అర్థం చేసుకునే వ్యక్తిని. ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిలో నిజాయతీగా సమాజం గురించి ఆలోచిస్తూ ప్రశ్నలు వేసిన వారు ఉన్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై పార్వతి కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. అందుకు నాకు ఆమెపై ఎలాంటి కోపం లేదు. ఆమె సినిమాలు కూడా నాకు చాలా నచ్చాయి. కానీ, నాకు కోపం వచ్చేది ఎక్కడంటే..సోషల్ మీడియాలో ఈ సినిమాపై జరుగుతున్న హడావుడి. నెటిజన్స్ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అసలు వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకావడంలేదు. నా అడ్డుపెట్టుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది నాకు నచ్చడంలేదు. అంతేకానీ మీరు అర్జున్ రెడ్డి సినిమా గురించి ఏం అనుకున్నా నేను పట్టించుకోను’ అని వెల్లడించారు. విజయ్ ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో గెస్ట్‌గా పాల్గొన్నారు.