ప్రముఖ సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్..ఇవాళ్టి నుంచి భారత్‌లో ట్విట్టర్ బ్లూ టిక్‌ను ప్రారంభించింది. ఇది ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైసులతోపాటు వెబ్‌లోనూ అందుబాటులో ఉంటుంది. ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రైబర్స్ వారి ప్రొఫైల్లో కొన్ని ఫీచర్స్ తోపాటు ధృవీకరించబడిన బ్లూటిక్ మార్క్‌ను అందిస్తుంది. దీని కోసం ట్విట్టర్ వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తోంది. మొబైల్‌లో ట్విట్టర్‌ను ఉపయోగించే భారతీయ ట్విట్టర్ వినియోగదారులు నెలకు రూ. 900 ఖర్చు చేయవలసి ఉంటుంది. వెబ్ వినియోగదారులు అయితే నెలకు రూ. 650 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ట్విట్టర్ వినియోగదారులకు వార్షిక ప్రణాళికను కూడా అందిస్తోంది. ట్విటర్ బ్లూ సేవలను ఏడాది పొడవునా పొందేందుకు భారతీయ వినియోగదారులకు రూ.6800 ప్లాన్ కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది.
కాగా ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత ట్విట్టర్ బ్లూటిక్ చెల్లింపు సర్వీసు గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. నష్టాల్లో ఉన్న కంపెనీని గట్టేక్కించేందుకు మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ బ్లూ టిక్ భారత్ కంటే ముందే చాలా దేశాల్లో పరిచయం చేసింది. అమెరికా, కెనడా, యుకె, న్యూజిలాండ్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ప్రారంభమైంది. ఈ దేశాలలో, వినియోగదారులు Twitter బ్లూ కోసం నెలకు $ 8 చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.