వారానికి ఏడుసార్లే తింటా.. ప్రతిరోజూ చన్నీళ్ల స్నానం చేస్తా! - MicTv.in - Telugu News
mictv telugu

వారానికి ఏడుసార్లే తింటా.. ప్రతిరోజూ చన్నీళ్ల స్నానం చేస్తా!

January 16, 2020

ceo02

ఈమధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఆరోగ్య రహస్యం గురించి చెప్పిన విషయం తెలిసిందే. తక్కువ తింటాను, తక్కువ మాట్లాడతాను, తక్కువ విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. ఇప్పుడు మరో ప్రముఖ వ్యక్తి వారానికి ఏడుసార్లు మాత్రమే భోజనం చేస్తానని అన్నారు. ఆయనెవరో కాదు సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే. వారంలో ఏడుసార్లు మాత్రమే భోజనం చేస్తున్నట్లు అది కూడా రాత్రి డిన్నర్‌ మాత్రమే చేస్తానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 డోర్సే తన ఆహారంలో చేపలు, చికెన్, ఆకుకూరలు కచ్చితంగా తీసుకుంటానని చెప్పారు. కొన్నిసార్లు బెర్రీలను, డార్క్ చాక్లెట్‌లను కూడా భోజనంగా తీసుకుంటానని తెలిపారు. రోజూ రెండు గంటలు ధ్యానం చేయడమే తన లక్ష్యమని డోర్సే చెప్పారు. తాను ప్రతి రోజు ఉత్సాహంగా పని చేస్తానని.. ఈ నేపథ్యంలోనే మంచంపై ఒరిగిన పది నిముషాల్లోనే నిద్ర తనను పలకరిస్తుందని పేర్కొన్నారు. తన కార్యాలయానికి ప్రతిరోజూ కాలినడకనే వెళ్తానని.. వెళ్తున్నప్పుడు విటమిన్ సి తీసుకుంటూ వెళతానని వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం చల్లనీళ్ల స్నానం తన మనస్సును ‘అన్‌లాక్’ చేస్తుందని అన్నారు. అలా చేయడంవల్ల ఏ సవాలునైనా సులభంగా అధిగమించవచ్చని డోర్సే అన్నారు. సాయంత్రం కూడా మరోసారి మూడు నిమిషాల పాటు ఐస్‌ బాత్‌ చేసి సేద తీరుతానని చెప్పారు. తన దైనందిన జీవితంలో అప్పుడప్పుడు ఉపవాసాలు కూడా ఉంటానని చెప్పారు.