Twitter Now Asks Some Fired Workers to Please Come Back
mictv telugu

పొరపాటైంది.. తిరిగొచ్చేయండి.. ట్విట్టర్ పిలుపు

November 7, 2022

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేశాక.. అందులో పనిచేస్తున్న ఉద్యోగులను చాలావరకూ తొలగించిన సంగతి తెలిసిందే. ఒక్కో రోజుకు మిలియన్ల డాలర్ల నష్టం వస్తుందని, ఉద్యోగులను తీసేయడం తప్ప మరో దారి లేదని మస్క్ ఈ పని చేశాడు. అయితే తొలగించిన ఉద్యోగుల్లో కొందరిని తిరిగి ఆఫీసుకు రమ్మంటూ ట్విటర్‌.. మెసేజ్‌లు పంపుతోందట. తొలిగించిన ఉద్యోగుల జాబితాలో కొన్ని తప్పులు దొర్లడంతో పొరపాటున కొంతమందిని ఇంటికి పంపించాల్సి వచ్చిందని.. బ్లూమ్‌బెర్గ్‌ ఆదివారం ఓ కథనంలో పేర్కొంది. అంతేకాకుండా వారిలో మరికొంత మంది నైపుణ్యాన్ని, అనుభవాన్ని గుర్తించడంలోనూ విఫలమైనట్లు ట్విటర్‌ గుర్తించిందని సదరు వ్యక్తులు తెలిపారు.

సంస్థలోని కమ్యూనికేషన్, కంటెంట్ క్యురేషన్, హ్యూమన్ రైట్స్, మెషిన్ లెర్నింగ్ తదితర శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులలో సగం మందిని మస్క్ ఇంటికి పంపించేశారు. ఇందులో కొంతమంది సేవలు కంపెనీకి అవసరం ఉంటుందని, వారి తొలగింపు విషయంలో పొరపాటు జరిగిందని బ్లూమ్ బర్గ్ కథనంలో పేర్కొంది. ట్విట్టర్ లో ఆ సంస్థ కొత్త యజమాని ఎలాన్ మస్క్ తీసుకురాబోయే సరికొత్త మార్పులకు ఈ ఉద్యోగుల అవసరం ఉందని సంస్థ భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. అయితే దీనిపై ట్విటర్‌ యాజమాన్యంగానీ, అధిపతి ఎలాన్‌ మస్క్‌ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు.