twitter office things for auction as musk struggles to pay rent
mictv telugu

అద్దె కట్టలేక పాట్లు పడుతున్న ఎలన్ మస్క్

January 18, 2023

twitter office things for auction as musk struggles to pay rent

ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్‌.. ఎలాన్ మస్క్ చేతిలో పడ్డాక తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగించింది. ఇప్పడు మరిన్ని కష్టాల్లోకి జారుకున్నట్టు కనిపిస్తోంది. ప్రధాన కార్యాలయాలకే అద్దె కట్టలేని పరిస్థితులు ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో శాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రధాన కార్యాలయంలోని కాఫీ మిషన్లు, లోగోలు, ఇతర ఆఫీసు సామగ్రిని వేలానికి పెట్టింది ట్విట్టర్.

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అద్దె కట్టలేక అవస్థలు పడుతున్నాడు. వినడానికి చాలా ఆశ్చర్యం కలిగించేదే అయినా నమ్మక తప్పదు. మస్క్ ట్విటర్ కొనుక్కున్న తర్వాత కొనుగోలు చేసిన తర్వాత కష్టాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పలు వివాదాలతో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు దక్కించుకున్న తర్వాత మస్క్.. ఆ కంపెనీలో అప్పటి వరకు పని చేస్తున్న సీనియర్లను ఇంటికి పంపించేశారు. తర్వాత ఉద్యోగులకు టార్గెట్లు విధించారు. రెస్ట్ లేకుండా పని చేయాలని ఆదేశించారు. తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగులను కూడా తొలగించారు. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ ఆఫీసులకు అద్దె కట్టలేని పరిస్థితులకు చేరుకున్నట్లు తెలుస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలోని కాఫీ మిషన్లు, నియాన్ లోగో, ఇతర సామగ్రిని వేలానికి పెట్టారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.

ట్విట్టర్ ఆఫీస్ లో వేలానికి పెట్టిన వ్తువులను ఎవరైనా కొనుక్కోవచ్చును. ట్విట్టర్ ఉద్యోగులు ఉపయోగించిన ఎస్ప్రేస్సో కాఫీ మిషన్, నియాన్ డిస్ల్పే లోగో వంటివి ఆ సోషల్ మీడియా కంపెనీ ఫాన్స్ దక్కించుకోవచ్చు. ఈ వస్తువులను హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్ సంస్థ 27 గంటల ఆన్‌లైన్ వేలాన్ని నిర్వహించింది. ఈ వేలంలో 631 సర్‌ప్లస్ కార్పొరేట్ ఆఫీస్ ఆస్తులు ఉంచారు. ఇండస్ట్రీయల్ కిచెన్ వేర్, వైట్‌బోర్డులు, డెస్కుల వంటి ఆఫీస్ ఫర్నీచర్, కేఎన్95 మాస్కులు కలిగిన 100కుపైగా బాక్సులు, డిజైనర్ కుర్చీలు, కాఫీ మిషన్లు, ఐమాక్స్, ఛార్జింగ్ సౌకర్యాలు కలిగిన బైక్ స్టేషనరీలు లాంటివి వేలం వేసింది. ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కో హెడ్‌క్వార్టర్ వద్ద ఉన్న ట్విట్టర్ పిట్ట విగ్రహం, ‘@’ సింబల్ ఆకృతి లాంటి వాటిని 25 డాలర్ల బిడ్స్‌తో వేలానికి ఉంచారు. 20 గంటల ఆక్షన్ సమయం తర్వాత నియాన్ లోగో 17,500 డాలర్ల విలువతో 64 బిడ్స్ వచ్చాయి. ఈ వేలంలోనే అత్యధిక బిడ్ ఇదే. ట్విట్టర్ పిట్ట విగ్రహానికి 16వేల డాలర్లు, @ ఆకృతికి 4,100 డాలర్లు విలువతో 52 బిడ్లు నమోదయ్యాయి.

ఇదిలా ఉంటే ట్విట్టర్ అధికారులు, ఆర్గనైజర్ల మాటలు మరో విధంగా ఉన్నాయి. ట్విట్టర్ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం వస్తువులను వేలం వేయడం లేదని చెబుతున్నారు. తమ ఆర్థిక పరిస్థితిని ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బులు ఎలాంటి ప్రభావం చూపవని హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్ ప్రతినిధి ఒకరు ఫార్చ్యూన్ మ్యాగజైన్ కు తెలిపారు. ఈ వేలంపై వస్తున్న ప్రశ్నలకు ఆక్షన్ హౌస్ సమాధానం ఇవ్వదలుచుకోలేదని పేర్కొన్నారు. అయితే, కంపెనీలో ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్న ఎలాన్ మస్క్‌కు వేలం వలన వచ్చిన డబ్బులు కాస్త ఊరట కలిగించే అవకాశం లేకపోలేదు. శాన్ ఫ్రాన్సిస్కోలోనే మరో కార్యాలయానికి కూడా అద్దె చెల్లించలేదని కొద్ది రోజుల క్రితమే నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆసియా పసిసిఫిక్ కేంద్రమైన సింగపూర్‌ ఆఫీసులోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగులను కార్యాలయాన్ని ఖాళీ చేసి ఇంటి నుంచి పని చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.