గాల్లో విమానం.. కాక్‌పిట్‌లోనే కొట్టుకున్న ఇద్దరు పైలట్లు
విమానం గాలిలో ప్రయాణిస్తుండగానే.. ఎయిర్ ఫ్రాన్స్ విమానయాన సంస్థకు చెందిన ఇద్దరు పైలట్లు కాక్‌పిట్‌లో పరస్పరం కొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఏడాది జూన్‌లో ఆ సంస్థ విమానమొకటి జెనీవా నుంచి పారిస్ వెళ్తుండగా.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులోని పైలట్, కో-పైలట్ మధ్య గొడవ ప్రారంభమైంది. ఒకరినొకరు కొట్టుకున్న తర్వాత ఒకరినొకరు కాలర్‌తో పట్టుకున్నారు. కేబిన్ సిబ్బంది జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని స్విట్జర్లాండ్‌కు చెందిన లా ట్రిబ్యూన్ అనే మీడియా తెలిపింది. వారు మళ్లీ గొడవ పడకుండా నివారించేందుకు.. సిబ్బందిలో ఒకరు ఆ ప్రయాణం సాగినంతసేపూ కాక్‌పిట్‌లోనే ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరగగా, పరస్పరం దాడి చేసుకున్న ఇద్దరు పైలట్లపైనా సస్పెన్షన్ వేటు పడింది.
మొత్తానికి ఫ్లైట్ ఆ రోజు గమ్యానికి చేరిందని, సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఫ్రాన్స్ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. వారి మధ్య జరిగిన వివాదం మిగిలిన విమానాలను ప్రభావితం చేయలేదని.. ప్రయాణికుల భద్రత పట్ల ఎయిర్‌లైన్ నిబద్ధత కలిగిఉందని ఆయన అన్నారు.