two arrested for kidnapped a 23-year-old mute girl by Medak district police
mictv telugu

మెదక్ జిల్లాలో దారుణం.. మూగ యువతిని కారులో ఎత్తుకెళ్లి..

December 28, 2022

మెదక్‌ జిల్లా మద్దూరు మండలంలో దారుణం జరిగింది. మూగ యువతి(23)పై ఓ కామాంధుడు అత్యాచారం జరిపాడు. ఇందుకు మరో వ్యక్తి సహకరించాడు. ఆ తర్వాత బాధితురాలను ఇంటికి చేర్చే క్రమంలో ఆమె తండ్రి కంటపడ్డారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సాయంతో వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మద్దూరు మండలం లాడ్నూరు గ్రామానికి చెందిన యువతి సోమవారం రాత్రి సమీప బంధువుల ఇంట్లో జరిగిన వేడుకకు ఒంటరిగా హాజరై ఇంటికి తిరిగి వస్తుంది. అదే సమయంలో చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన బోయిని కనకస్వామి అతడి మిత్రుడు జనగామ జిల్లాకు చెందిన నరేశ్‌ కారులో ఆమెను కిడ్నాప్‌ చేశాడు. ఆమెపై అత్యాచారం చేసి అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరిగి గ్రామంలో వదిలివెళ్తుండగా కుటుంబ సభ్యులు గమనించి కారును వెంబడించారు.

ఆ గందరగోళంలో కారు వేగంగా వెళ్లి దుర్గమ్మ ఆలయం వద్ద ఢీకొంది. కారులోంచి దిగి కనకస్వామి(అత్యాచారం చేసిన నిందితుడు) పరారయ్యాడు. కారు కోసం వేచి చూస్తున్న అతడి మిత్రుడిని యువతి కుటుంబ సభ్యులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. యువతిపై అత్యాచారం చేసి పరారైన కనకస్వామిని అతడికి సహకరించిన నరేశ్‌లను అదుపులోకి తీసుకొని, కారును స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్సై తెలిపారు.