Two bodyguards for the cart seller
mictv telugu

తోపుడు బండి వ్యాపారికి..ఇద్దరు బాడీగార్డులు

July 20, 2022

రోడ్డుపై తోపుడు బండి మీద వస్త్రాలు అమ్ముకునే ఓ వ్యాపారికి కోర్టు ఇద్దరు బాడీగార్డులను నియమించింది. అతడికి ఎప్పుడు రక్షణగా ఉండాలని, ఆ ఇద్దరి బాడీగార్డులకు ఏకే 47 రైఫిళ్లతో కూడిన తుపాకులను ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఒక సామాన్య వ్యాపారం చేసుకునే వ్యక్తికి కోర్ట్ ఎందుకు ఇద్దరు బాడీగార్డులను నియమించింది? అతడు ఏదైనా నేరం చేశాడా? అని పలువురు తెగ ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు.

”ఉత్తరప్రదేశ్‌‌ రాష్ట్రం ఎటా జిల్లాలో నివాసం ఉంటున్న రామేశ్వర్ దయాళ్ ఓ తోపుడు బండిపై వస్త్రాలు విక్రయిస్తూ జీవిస్తున్నాడు. రామేశ్వర్ ఇటీవల ఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్‌సింగ్ సోదరుడు, జిల్లా పంచాయతీ మాజీ అధక్షుడు జుగేంద్రసింగ్‌ను కలిసి తన భూమి పట్టాను తనకు ఇప్పించాలని కోరాడు. దాంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. రామేశ్వర్‌…తనను కులం పేరుతో దూషించారంటూ జుగేంద్ర, లేఖపాల్ రాంఖిలాడి, రామమూర్తి, రేఖలపై ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో జుగేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. రామేశ్వర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, కేసును కొట్టివేయాలని కోర్ట్‌ను కోరాడు. దీంతో కోర్టుకు హాజరుకావాల్సిందిగా రామేశ్వర్ దయాళ్‌ను కోర్టు ఆదేశించింది. శనివారం ఆయన కోర్టుకు ఒంటరిగా రావడాన్ని గమనించిన కోర్టు..రామేశ్వర్‌కు రక్షణ ఎందుకు కల్పించలేదని పోలీసులను ప్రశ్నించింది. వెంటనే ఇద్దరు బాడీగార్డులను నియమించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు రామేశ్వర్‌కు ఇద్దరు గార్డులను నియమించి, ఏకే 47 రైఫిళ్లతో ఆయనకు రక్షణగా కల్పించింది” అని తెలిపారు.