ఏపీలో ఘోరం... నడిరోడ్డుపైనే అన్నదమ్ముల సజీవదహనం - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ఘోరం… నడిరోడ్డుపైనే అన్నదమ్ముల సజీవదహనం

June 24, 2022

ఏపీలోని ఏలూరు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఉదయాన్నే పొలం వద్దకు వెళుతున్న ఇద్దరు అన్నదమ్ములు విద్యుత్ షాక్ గురై దారిలోనే సజీవదహనమయ్యారు. ఒకేసారి ఇద్దరు కొడుకులు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే… జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన వల్లేపల్లి నాగేంద్ర(21), ఫణీంద్ర(19) సోదరులు. పెద్దవాడు బిటెక్, చిన్నవాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఇద్దరు పిల్లలను చదవించుకుంటున్నారు.

అయితే తండ్రికి అనారోగ్యంగా వుండటంతో నాగేంద్ర, ఫణీంద్ర ఇద్దరూ ఇవాళ తెల్లవారుజామున పాలు పితకడానికి పొలానికి వెళుతుండగా ఘోరం జరిగింది. రాత్రి ఎప్పుడో 11 కేవీ విద్యుత్ తీగలు తెగి పుంత రహదారిపై పడ్డాయి. గ్రామస్తులు కానీ విద్యుత్ శాఖ అధికారులు గానీ ఇది గమనించలేదు. దీంతో అన్నదమ్ములు బైక్ వెళుతుండగా విద్యుత్ సరఫరా అవుతున్న ఈ తీగలు తగిలాయి. దీంతో ఒక్కసారిగా బైక్ కు మంటలు అంటుకుని రెప్పపాటులో సోదరులిద్దరికి అంటుకున్నారు. దీంతో ఇద్దరు యువకులు సజీవదహనమై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చే తికి అందివచ్చిన కుమారులు చనిపోవడంతో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది.

ఇలా ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందడంతో ఆ కుటుంబంలోనే కాదు దేవులపల్లిలో విషాదం అలుముకుంది. నాగేంద్ర, ఫణీంద్ర ల మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.