Two brothers passed away of heart attack within 24 hours in jagtial
mictv telugu

తమ్ముడి అంత్యక్రియల్లో అన్న హఠాన్మరణం.. జగిత్యాలలో విషాదం

January 9, 2023

Two brothers passed away of heart attack within 24 hours in jagtial

రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు మధ్య ప్రేమ, అప్యాయతలే కాకుండా అనురాగం, అనుబంధం కూడా ఉంటుందని జగిత్యాల జిల్లాలో జరిగిన విషాద సంఘటన నిరూపించింది. తమ్ముడు గుండెపోటులో మరణించగా, అతనికి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో అన్న కూడా అదే విధంగా మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. 24 గంటల వ్యవధిలో చేతికి ఎదిగి వచ్చిన కొడుకులు ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబంతో పాటు బంధువులు, స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మెట్ పల్లి పట్టణంలోని రెడ్డికాలనీలో నివసించే నాగభూషణం టెంట్ వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమారులు సంతానం. శనివారం రెండో కుమారుడు బొగ శ్రీనివాస్ గుండెపోటులో అకాల మరణానికి గురయ్యాడు. ఆదివారం శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా, మొదటి కుమారుడు సచిన్ స్మశానవాటికలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచాడు. సచిన్ కోరుట్ల పట్టణంలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడని ఇతర కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే సోదరుడి మరణాన్ని తట్టుకోలేకనే అన్న సచిన్ తీవ్ర మనస్థాపానికి గురై మానసిక వేదనతో కుప్పకూలిపోయాడని వెల్లడించారు. ఇలా కేవలం ఒకేరోజు వ్యవధిలో ఇద్దరు చేతికి అందివచ్చిన కొడుకులు అకస్మాత్తుగా చనిపోవడాన్ని నాగభూషణంతో పాటు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన బంధువులు జీర్ణించుకోలేకపోయారు. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదని స్థానికులు సైతం దిగ్భ్రాంతికి లోనయ్యారు.